Supreme Court | హైదరాబాద్, ఏప్రిల్ 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ ): నిందితుల అరెస్టు సమయంలో పోలీసుల తీరు, నిబంధనల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు నిబంధనలను పాటించని పోలీసులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యూటీ) చెందిన డీజీపీలకు హెచ్చరికతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.
ఓ గొడవకు సంబంధించి హర్యానాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే, అరెస్టు చేసే సమయంలో ‘ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్’ కేసు నిబంధనలను పోలీసులు ఎంత మాత్రం పాటించలేదంటూ నిందితుడి సోదరుడు ఎస్పీకి మెయిల్ చేశాడు. తమ ఇంట్లోనే కాకుండా పోలీసు స్టేషన్లో కూడా తన సోదరుడిపై పోలీసులు దాడులకు పాల్పడినట్టు ఆ మెయిల్లో ఆరోపించాడు. మెయిల్ విషయం తెలుసుకొన్న పోలీసులు మరింతగా రెచ్చిపోయారని, తన సోదరుడిపై మళ్లీ దాడి చేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు. ఈ క్రమంలో అరెస్టు సమయంలో నిబంధనలను అతిక్రమించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పంజాబ్, హర్యానా హైకోర్టును పిటిషనర్లు ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పిటిషనైర్లెన సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నేరగాళ్లకూ చట్టప్రకారం వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి.
క్రిమినల్స్ అయినప్పటికీ వారి గౌరవానికి భంగం కలుగకుండా భౌతికపరమైన రక్షణను కల్పించాల్సిందే.
ఇక ఈ కేసు విషయంలో పిటిషనర్‌ను ఓ నిందితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ క్రమంలో ఓ సామాన్యుడైన పిటిషనర్ కోపాన్ని ప్రదర్శించాడంటే అర్థముంది. అయితే, అన్నీ తెలిసిన పోలీసులు కూడా పరిధి దాటి రెచ్చిపోవడమేంటి? ఇది సరైన చర్య అనిపించుకోదు.
పౌరుల భద్రతకు, సమాజంలో శాంతి నెలకొల్పడానికి పోలీసులదే కీలక పాత్ర. అయితే, పోలీసులను చూసి సాధారణ పౌరులు భయపడకూడదు. పోలీసులు తమకు భద్రత కల్పిస్తారన్న నమ్మకం, భరోసా పౌరుల్లో కలగాలి.
ఆర్నేష్ కుమార్ కేసులో పేర్కొన్న తొమ్మిది అంశాల చెక్లిస్ట్ను ఈ కేసులో పోలీసులు పాటించినట్టు మాకు కనిపించడంలేదు. ఏదో యాంత్రికంగా దాన్ని నింపేసినట్టుగా ఉన్నది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకూడదు.
చెక్‌లిస్ట్ ఆమోదంలో కోర్టులు విచక్షణతో పనిచేయాలి. ఈ విషయంలో హైకోర్టు సరిగ్గా పనిచేసినట్టు కనిపించడంలేదు.
అరెస్టు సమయంలో పాటించాల్సిన నిబంధనలను పోలీసులు ఇంకా ఆచరణలో పెట్టట్లేదు. 2024లో సోమ్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పులోనూ ఇదే విషయాన్ని మేం గుర్తు చేశాం.
వ్యక్తుల అరెస్టు సమయంలో నిబంధనల ఉల్లంఘనలు మళ్లీ పునరావృతమైతే మేం ఒప్పుకునేది లేదు.