న్యూఢిల్లీ, మే 14: ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. బేషరతు క్షమాపణలు చెబుతూ అశోకన్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను తిరస్కరించిన జస్టిస్ హిమాకోహ్లీ, ఏ అమనుల్లా ధర్మాసనం.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది.
‘సోఫాలో కూర్చొని కోర్టును బహిరంగంగా విమర్శిస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వలేరు’ అని పేర్కొన్నది. ‘మీ నుంచి మేం బాధ్యతాయుతమైన ప్రవర్తనను ఆశించాం. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? అవతలి వాళ్లను కోర్టుకు లాగిన మీరు.. కోర్టు ఆర్డర్ తర్వాత మీరు కూడా అదేవిధంగా మీడియా ముందు స్టేట్మెంట్లు ఇచ్చారు?’ అని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు గౌరవాన్ని తగ్గించే ఉద్దేశం తనకు లేదని, తన తప్పు తెలుసుకొన్నానని, తన వ్యాఖ్యలకు చింతిస్తూ క్షమాపణలు చెబుతున్నానని అశోకన్ అఫిడవిట్లో పేర్కొన్నారు.