Noida Twin Towers | నొయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత వల్ల తమ సంస్థకు సుమారు రూ.500 కోట్ల నష్టం వాటిల్లిందని రియాల్టీ సంస్థ సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నొయిడా ట్విన్ టవర్స్‌ను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే.
`ఈ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూమి కొనుగోలు, టవర్ల నిర్మాణ ఖర్చు. వివిధ అనుమతులకు ప్రభుత్వశాఖలకు ఫీజు చెల్లింపులు, ఏండ్ల తరబడి బ్యాంకులకు వడ్డీ, టవర్లలో ప్లాట్ల యజమానులకు 12 శాతం వడ్డీతో పరిహారం చెల్లింపుతో కలిపి మొత్తం రూ.500 కోట్ల నష్టం ఉంటుంది` అని ఆర్కే అరోరా తెలిపారు.
సురక్షితంగా టవర్లను కూల్చేయడానికి ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థకు రూ.17.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్కే అరోరా పేర్కొన్నారు. ఈ టవర్లకు రూ.100 కోట్ల బీమా కవరేజీ ఉందన్నారు. కూల్చివేతతో ఇతర ఖర్చులు కూడా కలిసి ఉన్నాయని తెలిపారు. టవర్ల కూల్చివేత ప్రక్రియ చేపట్టేందుకు సౌతాఫ్రికా నిపుణుల సంస్థ జెట్ డెమోలిషన్స్ నిపుణులను ఎడిఫైస్ నియమించుకున్నది.