Sujatha Saunik | ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సుజాత సౌనిక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో 64 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. సీఎస్ నితిన్ కరీర్ పదవీ విరమణ చేయడంతో సుజాత ఈ పదవిలో నియమితులయ్యారు. ఆమె 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో సీఎస్‌గా పని చేశారు.
మేధా పాట్కర్‌కు ఐదు నెలల జైలు
ఢిల్లీ: 23 ఏండ్ల నాటి పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌కు ఢిల్లీ కోర్టు ఐదు నెలల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ ఆదేశాలపై ఆమె అప్పీలుకు వెళ్లేందుకు శిక్షను నెల పాటు వాయిదా వేసింది. పాట్కర్ ఓ టీవీ చానల్లో తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ 2001లో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆమెపై పరువునష్టం కేసు వేశారు. తాజాగా ఈ కేసులో మేజిస్ట్రేట్ రాఘవ్శర్మ తీర్పు వెలువరించారు. అంతకుముందు 2000వ సంవత్సరంలో సక్సేనాపై పాట్కర్ దావా వేశారు. అప్పటి నుంచి వీరిమధ్య వివాదం కొనసాగుతున్నది. పరిశీలన షరతులపై తనను విడుదల చేయాలన్న పాట్కర్ విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు.
వాణిజ్య సిలిండర్ ధర రూ.30 తగ్గింపు
న్యూఢిల్లీ, జూలై 1: అంతర్జాతీయ చమురు ధరల్లో మార్పులకు అనుగుణంగా దేశీయంగా 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.30 తగ్గింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ.1,646గా నమోదైంది. ఇదే సమయంలో విమాన ఇంధనం(ఏటీఎఫ్) రేటు 1.2 శాతం పెరిగింది. దీని ప్రకారం ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.1179.37 పెరిగి రూ.96,148.38కి చేరింది. వాణిజ్య సిలిండర్ ధరను గత నాలుగు నెలలుగా వరుసగా తగ్గిస్తున్నారు. మరోవైపు గృహావసరాలకు వాడే వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.