Suicide : భార్యల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడే భర్తల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని నెలల క్రితం బెంగళూరులో అతుల్ శుభాష్ అనే ఐటీ ఉద్యోగి భార్య వేధింపులు భరించలేకనే చనిపోతున్నానని 40 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 24న ముంబై ఐటీ ఉద్యోగి మానవ్ శర్మ తన చావుకు తన భార్య వేధింపులే కారణమని పేర్కొంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ముంబైలో ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగి తన చావుకు తన భార్యే కారణమని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు ముందు అతను తన సూసైడ్ నోట్‌ను కంపెనీ వెబ్సైట్లో పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన నిశాంత్ త్రిపాఠి స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆయన సహారా హోటల్లో రూమ్ బుక్ చేసుకుని దిగాడు. ఆత్మహత్యకు ముందు తన గది బయట ‘డు నాట్ డిస్టర్బ్’ అనే బోర్డు తగిలించాడు. దాంతో సిబ్బంది ఆయన గది తలుపు తట్టలేదు. అయితే మూడు రోజులైనా త్రిపాఠి గది నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి మారు తాళంతో గది తెరిచి చూశారు. అప్పటికే అతను ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు.
తన భార్య అపూర్వ పారిఖ్, అత్త ప్రార్థన మిశ్రాల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని నిశాంత్ తన సూసైడ్ నోట్లో రాశాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి నీలం చతుర్వేది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్లో నిశాంత్ తన భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. భార్య, అత్త కలిసి తనను ఏవిధంగా వేధించారో వివరించాడు. భార్య కారణంగా చనిపోతున్న సందర్భంగా కూడా తనకు ఆమెపై ప్రేమే ఉందని పేర్కొన్నాడు.
‘నువ్వు ఈ లేఖ చవిటప్పటికీ నేను ఈ లోకంలో ఉండను. నా ఆఖరి రోజుల్లో చోటుచేసుకున్న ప్రతి ఘటన నేను నిన్ను ద్వేషించాల్సినదే. కానీ నేను అలా చేయలేదు. అలాంటి సందర్భంలో కూడా నేను నిన్ను ప్రేమించాను. నిన్ను ఇప్పటిదాకా ప్రేమించాను. ఇప్పుడు ప్రేమిస్తున్నాను. నాలో నీపై ఉన్న ప్రేమ ఇకపై కూడా చెరిగిపోదని నీకు ప్రమాణం చేస్తున్నా’ అని నిశాంత్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ‘నీతో, ప్రార్థన అత్తలో నేను పడిన యాతన అంతా మా అమ్మకు తెలుసు. నా చావుకు మీరు ఇద్దరే కారణం. చనిపోతే నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి మా అమ్మ దగ్గరికి వెళ్లకండి. ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది. కాబట్టి కనీసం ఆమెను ప్రశాంతంగా బాధపడనివ్వండి’ అని భార్య, అత్తను అభ్యర్థించాడు.
నిశాంత్ తల్లి కూడా కొడుకు మరణం గురించి తన ఎక్స్ ఖాతాలో హృద్యమైన పోస్టు పెట్టారు. ‘నా జీవితం ఒడిసింది. నా కొడుకు నన్ను వదిలి వెళ్లిపోయాడు. నేను ఇప్పుడు ఒక జీవచ్ఛవాన్ని అయ్యాను. తను నా అంతిమ సంస్కారాలు చేయాల్సి ఉండె. కానీ నేను నా కొడుకు అంత్యక్రియలు చేశాను. నా కుమార్తె తన అన్నకు తల కొరివి పెట్టింది. నాకు, నా బిడ్డకు ఈ కఠోర పరిస్థితి నుంచి బయటపడే ధైర్యం కావాలి’ అని తన పోస్టులో పేర్కొన్నారు.