Sugar Test | న్యూఢిల్లీ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కొలవడం మధుమేహ బాధితులకు పెద్ద సమస్య. సూదితో చర్మాన్ని గుచ్చి రక్తాన్ని సేకరిస్తుంటారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. చర్మానికి కోతపెట్టాల్సిన అవసరం లేకుండా కాంతి (లేజర్ కిరణాలు) సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని వారు కనుగొన్నారు. ‘ఫొటోఅకౌస్టిక్ సెన్సింగ్’ టెక్నాలజీలో కణజాలం సంకోచించి.. వ్యాకోచిస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి ప్రకంపనల్ని డిటెక్టర్లు పసిగడతాయి. ధ్వని తరంగ తీవ్రతను అనుసరించి గ్లూకోజ్ స్థాయిని నిర్ణయిస్తామని సైంటిస్టులు చెబుతున్నారు.