న్యూఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన మాజీ సైనికుడు సుబేదార్ థాన్సియా (Subedar Thanseia) మార్చి 31న మరణించారు. మిజోరమ్కు చెందిన ఆయన 102 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారని ఇండియన్ ఆర్మీ తెలిపింది. కీలకమైన కోహిమా యుద్ధంలో సుబేదార్ థాన్సియా పోషించిన కీలక పాత్ర మిత్ర కూటమి దళాల విజయానికి దోహదపడిందని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. క్లిష్టమైన జెస్సామిలో ఆర్మీ బలగాల మోహరింపు సమయంలో 1వ అస్సాం రెజిమెంట్ వారసత్వాన్ని చాటడంలో ముఖ్య పాత్ర వహించారని ఆర్మీ అధికారి కొనియాడారు. భారత ఆర్మీ చరిత్రలో విజయ చిహ్నంగా ఆయన మిలిగిపోతారని అన్నారు.
కాగా, పదవీ విరమణ తర్వాత కూడా సమాజం, దేశం పట్ల అంకితభావం, స్ఫూర్తిని సుబేదార్ థాన్సియా కొనసాగించారని ఆర్మీ పేర్కొంది. తన అనుభవాలను తెలియజేయడంతోపాటు, విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొన్నట్లు వెల్లడించింది.