న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)తో ఆరోగ్య సంరక్షణ రంగం రూపురేఖలు మారిపోతున్నాయి. రోగులే స్వయంగా రోజువారీ జాగ్రత్తలు తీసుకునేందుకు ఏఐ సాయపడే రోజులు రాబోతున్నాయి. టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ఏఐ డయాగ్నొస్టిక్ ఆర్కెస్ట్రేటర్ (ఎంఏఐ-డీఎక్స్ఓ)తో ఆ కలలు సాకారమయ్యే అవకాశం ఉంది. దీనిని ఓపెన్ఏఐకి చెందిన అడ్వాన్స్డ్ ఓ3 ఏఐ మోడల్‌తో జత చేసినపుడు, 10 కేస్ స్టడీస్‌లో ఎనిమిదింటికి పైగా పరిష్కారం లభించింది. వైద్యుల చేత అధ్యయనం చేయించడం కన్నా ఈ విధానం చాలా చౌక అయినదని కూడా మైక్రోసాఫ్ట్ తెలిపింది.
నిపుణులైన ఫిజీషియన్ల బృందం పని చేసినట్లుగా ఈ ఏఐ టూల్ పని చేస్తుంది. ఇది అత్యంత సంక్లిష్టమైన, మేధాశక్తి అవసరమైన కేసులను చూడగలదు. ఇది ఎన్‌ఈజేఎం కేసు ప్రొసీడింగ్స్‌లో 85 శాతం వరకు కచ్చితంగా వ్యాధి నిర్ధారణ చేయగలిగిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అనుభవజ్ఞులైన ఫిజీషియన్ల బృందం కన్నా ఈ ఏఐ టూల్ 4 రెట్ల సమర్థంగా పని చేసిందని చెప్పింది. అయితే ఈ ఏఐ టూల్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, దీనిని వైద్యపరంగా ఉపయోగించే అవకాశం ప్రస్తుతం లేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది.