బెంగళూరు: కర్ణాటకలోని యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. చపాతీల తయారీపై రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో స్టూడెంట్స్ కొట్టుకున్నారు. (Students Clash) ఈ ఘర్షణలో ఒకరు గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. కలబురగిలోని కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి క్యాంపస్‌లోని మెస్‌లో చపాతీల తయారీపై వివాదం చెలరేగింది. మెషిన్ తయారీ చపాతీలు కావాలని ఉత్తర భారత విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే చేతితో తయారు చేసిన చపాతీలు కావాలని దక్షిణ భారత విద్యార్థులు పట్టుబట్టారు.
కాగా, ఈ వాగ్వాదం ముదరడంతో స్టూడెంట్ గ్రూపుల మధ్య ఘర్షణగా మారింది. ఈ కోట్లాటలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేశారు. మరోవైపు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.