న్యూఢిల్లీ: అంతరిక్షంలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ గ్రహ శకలం(ఆస్టరాయిడ్)ను గుర్తించిన తొమ్మిదో తరగతి విద్యార్థి అందరి చేతా ‘శభాష్!’ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నోయిడా నగరంలోని శివ్ నాడార్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి దక్ష్ మాలిక్ చేసిన కృషిని ‘నాసా’ గుర్తించింది. ‘ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్’లో పాలుపంచుకున్న దక్ష్ మాలిక్ కొత్త ఆస్టరాయిడ్‌ను గుర్తించటంలో సక్సెస్ అయ్యాడు. దీనికి శాశ్వత పేరు నిర్ణయించే అవకాశం ‘నాసా’ దక్ష్ మాలిక్‌కే ఇచ్చింది. 2022 నుంచి ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌లో అతడు పాలు పంచుకున్నాడు. 2023లో ఈ కొత్త ఆస్టరాయిడ్‌ను మాలిక్ కనుగొనగా, ప్రస్తుతం దీనిని ‘2023 ఓజీ40’ పేరుతో సైంటిస్టులు పిలుస్తున్నారు.