న్యూఢిల్లీ: 12వ తరగతి విద్యార్థిని(19) గోవుల స్మగ్లర్ అని పొరపాటుగా భావించిన కొందరు గో సంరక్షకులు అతడిని కాల్చి చంపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు పశువుల స్మగ్లర్లు డస్టర్, ఫార్చూన్ కార్లలో నగరంలోకి ప్రవేశించినట్టు గోసంరక్షకులకు సమాచారం అందింది. అదే సమయంలో బాధితుడు ఆర్యన్ మిశ్రా తన స్నేహితులు హర్షిత్, శాంకీ, మరో ఇద్దరు మహిళలతో కలిసి డస్టర్ కారులో వెళ్తుండగా, పశువుల స్మగర్లుగా భావించి గోసంరక్షకులు 25 కిలోమీటర్లు వెంబడించారు. వాళ్లపై కాల్పులు జరపడంతో ఆర్యన్ మిశ్రా ప్రాణాలు కోల్పోయాడు.
‘భర్తను వేరే గదిలో నివసించమనడం క్రూరత్వమే’
అలహాబాద్: భర్తను వేరే గదిలో నివసించమనడం, సంసారం చేయడానికి నిరాకరించడం భౌతిక, మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని.. విడాకుల మంజూరుకు ఇది తగిన కారణమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మానసిక క్రూరత్వాన్ని నిరూపించడం కష్టమని.. వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా దాన్ని పరిశీలించాలని చెప్పింది. భర్తను వేరే గదిలో నివసించమని ఒత్తిడి చేయడం ద్వారా అతడితో కాపురం చేయడానికి భార్య నిరాకరించడం అతడి దాంపత్య హక్కులను నిరాకరించడమేనని కోర్టు తెలిపింది. ఓ కేసులో ఈ మేరకు దంపతులకు విడాకులు మంజూరు చేసింది.