పాట్నా: బీహార్లో ఇవాళ మళ్లీ విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. రైల్వే బోర్డు పరీక్షలో జరిగిన అవకతవకలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించారు. పాట్నాలో రోడ్లను బ్లాక్ చేశారు. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు విద్యార్థులు భారీగా స్పందించారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష ఫలితాల్లో గోల్మాల్ జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్లో గత కొన్ని రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. గయాలో రెండు రోజుల క్రితం ఆందోళనకారులు ఓ రైలుకు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు.. ఎన్టీపీసీతో పాటు లెవల్ 1 పరీక్షలను రద్దు చేసింది. ఇవాళ జరిగిన నిరసన ప్రదర్శనలో వివిధ విద్యార్థి సంఘాలు పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. జనవరి 15వ తేదీన రైల్వే బోర్డు ఎన్టీపీసీ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేసింది. నిజానికి ఆ పరీక్షలను సుమారు 1.25 కోట్ల మంది విద్యార్థులు రాశారు. 35 వేల పోస్టులకు ఆ పరీక్షలు జరిగాయి. అయితే ఆ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ చెప్పింది.