లక్నో: ఉపాధ్యాయురాలి అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో విద్యార్థులు పోస్ట్ చేశారు. (Student Posts Video Of Teacher) ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఒక పేజీని తెరిచారు. దీంతో బాధిత టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన ఒక మహిళ, మధురలోని స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నది. చదువులో వెనుక ఉన్న పదో తరగతి విద్యార్థికి ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పింది. చనువు ఏర్పడంతో టీచర్ అశ్లీల వీడియోను ఆ స్టూడెంట్ తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో టీచర్ అతడికి దూరంగా ఉండసాగింది.
కాగా, ఆ విద్యార్థి ఆగ్రహంతో రగిలిపోయాడు. టీచర్ అశ్లీల వీడియోను ముగ్గురు స్నేహితులకు పంపాడు. వారు దానిని వాట్సాప్‌లో మరికొందరికి షేర్ చేశారు. అలాగే వారంతా కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని క్రియేట్ చేశారు. బాధిత టీచర్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో మిషన్ శక్తి అభయాన్ కేంద్రానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. విద్యార్థుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు ఆ కేంద్రం మద్దతు, వారి ధైర్యంతో పోలీసులకు ఆ టీచర్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మైనర్లా కాదా అన్నది ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.