భోపాల్, డిసెంబర్ 10: దేశంలో అత్యుత్తమమైన దానిలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది అమాయకుడైన ఒక విద్యార్థిని తప్పుడు డ్రగ్స్ కేసులో ఇరికించబోయి అభాసు పాలయ్యారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్ దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే ఈ స్టేషన్ సిబ్బంది ఒక అమాయకుడైన విద్యార్థిని బస్ నుంచి కిడ్నాప్ చేసి, అతడిపై అన్యాయంగా డ్రగ్స్ కేసును నమోదు చేసినట్టు హైకోర్టు గుర్తించింది. ఆ వ్యవహారంలో సిబ్బంది అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు రుజువైంది. దీంతో మాండసర్ పోలీస్ ఎస్పీ న్యాయస్థానంలో జడ్జి ముందు నిలబడి ఇది తప్పుడు కేసేనని అంగీకరించారు. ఆగస్టు 29న 18 ఏండ్ల 12వ తరగతి విద్యార్థి సోమాన్ను మల్హర్‌గఢ్ పోలీసులు నడుస్తున్న బస్ నుంచి బలవంతంగా లాక్కుని పోయారు.
అతడి నుంచి 2.7 కేజీల ఓపియమ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపిస్తూ మరునాడు కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. అయితే తర్వాత బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ వీడియోలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. పారిపోతున్న నిందితుడిని వెంటాడి పట్టుకున్నామని, అతని నుంచి నల్లమందు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పినది కట్టుకథేనని ఈ ఫుటేజ్‌లు నిజాన్ని బయటపెట్టాయి. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఈ నెల 5న హైకోర్టును ఆశ్రయించారు. ఎస్పీ వినోద్ కుమార్ మీనాను జడ్జి న్యాయస్థానానికి రప్పించడంతో మంగళవారం ఆయన నిజాన్ని ఒప్పుకున్నారు. తాము ఆ విద్యార్థిపై తప్పుడు కేసు బనాయించామని అంగీకరించారు.