Satara | సతారా, ఫిబ్రవరి 16: పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థికి ట్రాఫిక్ రూపంలో మరో పరీక్ష ఎదురైంది. దీంతో ఆ విద్యార్థి వినూత్నంగా ఆలోచించి సమస్యను అధిగమించాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన విద్యార్థి ట్రాఫిక్ కారణంగా ఏకంగా పారాైగ్లెడింగ్ చేసి, కాలేజీకి చేరుకున్నాడు. దీంతో సకాలంలో పరీక్షకు హాజరయ్యాడు. అతడి ప్రయాణాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా, నెటిజన్లు అవాక్కయ్యారు. మహారాష్ట్రలోని వాయి తాలుకా పసరాని గ్రామానికి చెందిన సమర్థ్ మహంగడే ఇటీవల ఈ సాహసాన్ని ప్రదర్శించాడు.
పరీక్ష రాయడానికి కాలేజీకి బయలు దేరిన అతడికి వాయి-పంచగని రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ కనిపించింది. వెంటనే దానికి బెంబేలెత్తిపోకుండా పారా ైగ్లెడింగ్ ద్వారా కాలేజీకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సాహస క్రీడల నిపుణుడైన గోవింద్ యెవాలె సాయం కోరాడు. ఆయన అంగీకరించడంతో నిపుణుడి సాయంతో పారా ైగ్లెడింగ్ దుస్తులు వేసుకొని, కాలేజీ బ్యాగును భుజాన వేసుకొని రయ్ మంటూ ఆకాశంలో సాగిపోయి పరీక్ష కేంద్రం సమీపంలో వాలిపోయాడు.