బెంగళూరు: బైక్పై వెళ్తున్న యువకుడు అడ్డుగా వచ్చిన వీధి కుక్కను తప్పించబోయి రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క మృతుడి ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లి చేతిలో తల పెట్టి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. (Stray Dog remorseful) నాటి నుంచి అది వారి ఇంట్లోనే ఉంటున్నది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన కర్ణాటకలోని దావణగెరెలో జరిగింది. నవంబర్ 16న బైక్ నడిపిన 21 ఏళ్ల తిప్పేష్ శివమొగ్గ జిల్లాలోని భద్రావతి ప్రాంతంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన వీధి కుక్కను తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురైన అతడు తీవ్ర గాయాలతో మరణించాడు.
కాగా, తిప్పేష్ మరణానికి కారణమైన ఆ వీధి కుక్క అతడి మృతదేహాన్ని తరలించిన వాహనం వెంట వెళ్లింది. ప్రమాద స్థలం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతడి ఇంటికి చేరుకున్నది. అంత్యక్రియలప్పుడు కూడా అక్కడే ఉంది. ఆ వీధిలోని కుక్కల బారి నుంచి తప్పించుకున్న ఆ కుక్క మూడు రోజుల తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లింది. తిప్పేష్ తల్లి యశోదమ్మ వద్దకు చేరుకుంది. ఆమె చేతిపై తల ఉంచి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. నాటి నుంచి వారి ఇంట్లోనే అది ఉంటున్నది.
మరోవైపు చాలా వింతగా ప్రవర్తించిన ఈ వీధి కుక్క గురించి తిప్పేష్ కుటుంబ సభ్యులు, పొరుగువారు మీడియాకు వెల్లడించారు. ఆ కుక్కపై తమకు ఎలాంటి కోపం లేదని తిప్పేష్ సోదరి చందన తెలిపింది. సోదరుడి మరణం దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనగా పేర్కొంది. తనను బస్టాంప్ వద్ద దించి ఇంటికి తిరిగి వెళ్తున్న సోదరుడ్ని ఆ ప్రమాదంలో కోల్పోయినట్లు వెల్లడించింది. కాగా, తిప్పేష్ మరణానికి కారణమైన ఆ కుక్కతో అతడి కుటుంబ సభ్యుల అనుబంధానికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.