ముంబై, జూలై 6 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ముంబైలో చార్కోప్ ప్రాంతంలో అమానుషం చోటు చేసుకుంది. 15 ఏండ్ల బాలికపై సవతి తండ్రి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. హోటళ్లలో ఆ బాలికతో వ్యభిచారం చేయిస్తుండటం కలకలం రేపింది. ఆ బాలిక చాలాసార్లు మోసపోవడమే కాక, తీవ్ర వేధింపులకు గురైంది. ఆమె తల్లి, సవతి తండ్రితో కలిసి కూతురిని నిర్దాక్షిణ్యంగా ఆ రొంపిలోకి దింపడం గమనార్హం.
ఈ కేసులో ముంబై పోలీసులు ఆమె తల్లి, సవతి తండ్రితోపాటు వారికి సహకరించిన ఆటో డ్రైవర్ను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… బాధిత బాలిక తల్లి వేరే వ్యక్తితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఏడు నెలలుగా సవతి తండ్రి ఆమెను వేధించడంతో పాటు.. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అందుకు కన్న తల్లే సహకరించి.. కూతురిని వ్యభిచార రొంపిలోకి దించింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ బాలిక ఇంట్లోంచి పారిపోయింది. అయితే తల్లి కూతురు అదృశ్యమైందని పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది.