ముంబై, ఆగస్టు 13: వీర్య, అండ దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్ స్పష్టం చేసింది. వారిని పిల్లలకు జీవ సంబంధ(బయలాజికల్) తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తెలిపింది. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తన పిల్లలు అద్దె గర్భం ద్వారా పుట్టారని.. వారు తన భర్త, సోదరితో ఉంటున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపింది. తన సోదరే తనకు అండం దానం చేసిందని.. అయితే ఆమెకే పిల్లలపై చట్టబద్ధ హక్కు ఉంటుందని తన భర్త వాదిస్తున్నాడని కోర్టుకు తెలిపింది. భర్త వాదనను కోర్టు తోసిపుచ్చింది.
విభేదాల కారణంగా 2021లో పిటిషనర్ భర్త ఇద్దరు పిల్లలను తీసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ పిల్లల బాగోగులను పిటిషనర్ సోదరి చూసుకుంటుందని అతడు తెలపడంతో పిటిషనర్ స్థానిక కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆమె అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో హైకోర్టులో కేసు వేశారు.