ముంబై : ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు ఓ దివ్యాంగుడు నాగపూర్ వీధుల్లో సమోసాలు విక్రయిస్తున్నాడు. గుండెలను తడిమే ఈ వీడియోను (Viral Video) ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వైరల్ క్లిప్‌లో సూరజ్ అనే దివ్యాంగుడు వీల్‌ఛైర్‌లో సమోసాలు విక్రయిస్తూ కనిపించాడు.
తన వీల్‌ఛైర్‌లోనే ప్లేట్ సమోసాను రూ. 15కు అమ్ముతున్నాడు. తాను నాగపూర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పూర్తిచేశానని, అయితే మంచి ఉద్యోగం సాధించలేకపోయానని సూరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు కొద్ది మొత్తంలోనైనా సంపాదించాలనే ఉద్దేశంతో సమోసాలు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నాడు.
సూరజ్ రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ సమోసాలు విక్రయిస్తుంటాడు. సివిల్ సర్వీసెస్ చదివేందుకు సూరజ్ సమోసాలు అమ్ముతున్నాడు..ఆయనకు మనం సాయం చేద్దాం అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. సూరజ్ స్ఫూర్తిప్రదాతగా నిలిచారని నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. అతడికి మరింత శక్తి చేకూరాలని ఓ యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More