చండీగఢ్: సమోసా విషయంలో ఘర్షణ జరిగింది. (Spat over samosa) ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు షాపు యజమానిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ సంఘటనపై వ్యాపారులు, స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. షాపులు మూసివేసి నిరసన తెలిపారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. రాకేష్ అనే వ్యక్తి ఫరూఖ్‌నగర్ ప్రాంతంలో సమోసా, టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. మే 12న పాత నేరస్తుడైన పంకజ్ తన అనుచరులతో కలిసి ఆ టీ స్టాల్ వద్దకు వచ్చాడు. సమోసా విషయంపై రాకేష్‌తో గొడవపడ్డాడు. అక్కడకు వచ్చిన పోలీసులు పంకజ్‌ను హెచ్చరించి అక్కడి నుంచి పంపేశారు.
కాగా, మరునాడు మే 13న పంకజ్ తన అనుచరులతో కలిసి ఆ టీ స్టాల్ వద్దకు వచ్చాడు. యజమాని రాకేష్‌పై గన్‌తో ఆరుసార్లు కాల్పులు జరిపి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. భయాందోళన చెందిన వ్యాపారులు తమ షాపులను మూసివేసి నిరసన తెలిపారు. స్థానికులు ఫరూఖ్‌నగర్-ఝజ్జర్ రహదారిని దిగ్బంధించారు. నిందితులను అరెస్ట్ చేయాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పోలీసుల నిర్లక్ష్యంపై రాకేష్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంకజ్‌పై సోమవారమే చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని వారు మండిపడ్డారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికులకు సర్దిచెప్పారు. నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు. రాకేష్ హత్యపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పంకజ్‌తో పాటు అతడి అనుచరులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.