Spadex Docking : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ మళ్లీ వాయిదాపడింది. ఇస్రో ఇటీవల రీషెడ్యూల్ చేసిన ప్రణాళిక ప్రకారం.. ఈ ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉపగ్రహాల మధ్య దూరం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో అనుసంధాన ప్రక్రియను మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటించింది.
ఇస్రో రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 500 నుంచి 225 మీటర్లకు తగ్గించేందుకు ఓ ప్రయోగం నిర్వహించింది. అయినా రెండు శాటిలైట్స్ మధ్య దూరం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో మరోసారి స్పేడెక్స్ డాకింగ్‌ను వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇస్రో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. అయితే ఈ డాకింగ్ప్రక్రియ రీషెడ్యూల్ తేదీని మాత్రం ప్రకటించలేదు.
మొదట స్పేడెక్స్ మిషన్‌లో డాకింగ్ ప్రక్రియను జనవరి 7న నిర్వహించేందుకు ఇస్రో ప్లాన్ చేసింది. అయితే మిషన్‌లో కొన్ని సాంకేతిక అవరోధాలు తలెత్తడంతో జనవరి 9వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. ఇవాళ కూడా డాకింగ్ సాధ్యపడకపోవడంతో మరోసారి రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. కాగా ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టింది.
ఈ మిషన్‌లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV-C60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్, అన్‌డాకింగ్ చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియ జరగనుంది.