హైదరాబాద్, జనవరి 8 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం రాష్ర్టాలకు ఇచ్చే నిధుల్లో దక్షిణాదికి వాటా పెరగాల్సిన అవసరం ఉన్నదని భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రహ్మణ్యన్ అభిప్రాయపడ్డారు. 2026లో చేపట్టనున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) సమయంలో దక్షిణాది రాష్ర్టాల నుంచి కేంద్రం అసంతృప్తి సెగను ఎదుర్కొనవచ్చని ఆయన అంచనా వేశారు. అలా జరుగకుండా ఉండాలంటే దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రం కొంచం ఎక్కువ నిధులను కేటాయించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తమిళనాడులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎం)లో మాట్లాడారు.
2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్కల ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉన్నది. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తున్నది. జనాభా ప్రాతిపదికన 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను కూడా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే జరిగితే, ఎక్కువ జనాభా ఉన్న యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ర్టాలకు ఎక్కువ లోక్సభ సీట్లు దక్కడంతో పార్లమెంట్లో ఆయా రాష్ర్టాలకు మరింత ప్రాతినిథ్యం లభించే అవకాశమున్నది. ఇదే సమయంలో జనాభా నియంత్రణను పాటిస్తున్న దక్షిణాది రాష్ర్టాలు గణనీయంగా సీట్లు కోల్పోవచ్చన్న వాదనలు ఉన్నాయి. ఇదే జరిగితే, దేశ ఆర్థిక వృద్ధికి ఎక్కువగా సహకారాన్ని అందిస్తున్న తమకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో (పార్లమెంట్లో ప్రాతినిథ్యం) ప్రాధాన్యాన్ని తగ్గించడాన్ని దక్షిణాది రాష్ర్టాలు ప్రశ్నించవచ్చన్న భయాలు నెలకొన్నాయి. ఇదే ఉద్దేశాన్ని వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యన్ తదనంతరం జరిగే పరిణామాలకు పరిష్కారాలను కూడా సూచించారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ సహకారం అందిస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు డీలిమిటేషన్ తర్వాత పార్లమెంట్లో ప్రాతినిథ్యం తగ్గిపోతే, ఆయా రాష్ర్టాల్లో అసంతృప్తి పెరిగిపోవచ్చని సుబ్రహ్మణ్యన్ అన్నారు. ఇది కాలక్రమేణా రాష్ర్టాల మధ్య సహకారం, రాజకీయ ప్రయోజనాల మధ్య అంతరానికి దారితీయొచ్చని హెచ్చరించారు. అలా జరగకుండా ఉండాలంటే నిధుల కేటాయింపులో దక్షిణాదికి వాటా పెంచాల్సిన అవసరమున్నదన్నారు.16వ ఆర్థిక సంఘం ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని తెలిపారు.