న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితులుగా ఉన్న గుప్తా బ్రదర్స్‌ను వేరొక కేసులో ఉత్తరాఖండ్‌లో అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలోని ప్రముఖ బిల్డర్ సతీందర్ సింగ్ సాహ్నీ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు కారణం గుప్తా బ్రదర్సేనని ఆయన సూసైడ్ నోట్లో రాశారు. అయితే ఇప్పుడు అరెస్టయిన అజయ్ గుప్తా, ఆయన బావ అనిల్ గుప్తా కొన్నేళ్ల క్రితం దక్షిణాఫ్రికాకు పారిపోయిన అజయ్ గుప్తా, అతుల్ గుప్తా, రాజేశ్ గుప్తా, అనిల్ గుప్తాలలో ఇద్దరేనా? కాదా? అనే అనిశ్చితి ఏర్పడింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమాతో సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ ముగ్గురు అన్నదమ్ములు వేల కోట్ల ర్యాండ్స్ (దక్షిణాఫ్రికా కరెన్సీ)ని కొల్లగొట్టినట్లు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు గుప్తా సోదరులను అరెస్ట్ చేసినట్లు తెలుసుకున్న దక్షిణాఫ్రికా అధికారులు స్పందిస్తూ, ప్రస్తుతం ఇద్దరు గుప్తాలు అరెస్టయినట్లు తెలిసిందని, తాము భారత్‌తో సంప్రదిస్తున్నామని తెలిపారు.