లక్నో: తండ్రి మరణించడాన్ని కుమారుడు తట్టుకోలేకపోయాడు. తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా బైక్‌పై అనుసరించాడు. ఆ బాధతో గుండెపోటుకు గురై మరణించాడు. (Son dies while escorting father’s body) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. మార్చి 20న కాన్పూర్‌లో నివసించే లయిక్ అహ్మద్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
కాగా, తండ్రిని బాగా ఇష్టపడే చిన్న కుమారుడు అతిక్ ఆయన చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడాన్ని నమ్మలేకపోయాడు. వెంటనే హార్ట్ స్పెషలిస్ట్‌లు ఉన్న మరో హాస్పిటల్‌కు అహ్మద్‌ను తరలించాడు. అయితే ఆయన మరణించినట్లు అక్కడి డాక్టర్లు కూడా నిర్ధారించారు. దీంతో అతిక్ వెక్కివెక్కి ఏడ్చాడు.
మరోవైపు అహ్మద్ మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి అంబులెన్స్‌లో తరలించారు. అతిక్ బైక్‌పై ఆ వాహనాన్ని అనుసరించారు. అయితే తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ బాధతో మార్గమధ్యలో అతిక్ గుండెపోటుకు గురై కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, తండ్రీకొడుకులు ఒకే రోజు చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారిద్దరి మృతదేహాలను కలిసికట్టుగా ఒకేచోట ఖననం చేశారు.