ముంబై, ఫిబ్రవరి 10: మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే మళ్లీ దీక్షకు దిగారు. శనివారం జల్నా జిల్లాలోని తన స్వగ్రామం అంతర్వాలి-సారతి గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టారు. ‘మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అమలుజేసేందుకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై..చట్టాన్ని చేయాలి.’ అని సీఎం ఏక్నాథ్ షిండే సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు. అంతేగాక మరాఠా సామాజికవర్గ సభ్యులపై దాఖలైన పోలీస్ కేసులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సర్కార్ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనిపై కూటమిలోని నాయకులు రకరకాలుగా మాట్లాడటం మరాఠా నేతల్ని ఆందోళనకు గురి చేసింది.