న్యూఢిల్లీ : కూరగాయల ధరలు భారమై, నూనెల రేట్లు సలసలా కాగుతుంటే తాజాగా టమాట ధరలు కొండెక్కడంతో వంటింటి బడ్జెట్ చుక్కలు చూస్తోంది. వంటగ్యాస్ ధరలూ అంతకంతకూ ఎగబాకుతుంటే ఖర్చులు తడిసిమోపడవుతున్నాయని మగువలు గగ్గోలు పెడుతున్నారు. టమాట ధరలైతే కిలోకు ఏకంగా రూ వంద దాటి పరుగులు పెడుతున్నాయి. టమాట ధరలు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, యూపీ సహా పలు రాష్ట్రాల్లో పైపైకి ఎగబాకాయి.
టమాట ధరలు చెన్నైలో కిలో రూ 160 పలుకుతుండగా ఏపీలో కొన్ని ప్రాంతాల్లో రూ 130కి చేరాయి. కర్నాటకలో రూ 90-120 వరకూ పలుకుతున్నాయి. ఇక తెలంగాణలో కిలో టమాట రూ 80-100 పైమాటే పలుకుతోంది. ఇక ముంబై సహా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో కిలో రూ 100కి ఎగబాకింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోనూ టమాట రూ 100 దాటింది.
అకాల వర్షాలు, డీజిల్ ధరల పెరుగుదల, పెండ్లిండ్ల సీజన్ డిమాండ్ వంటి కారణాలతో టమాట ధరలు పెరుగుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లలోకి తాజా పంట చేరుకుంటే ధరలు తగ్గుముఖం పడతాయని వ్యాపారులు చెబుతున్నాయి.