కొట్టాయం: ప్రఖ్యాత స్నేక్ క్యాచర్ వావా సురేశ్ ప్రస్తుతం ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. సోమవారం రోజున పామును పట్టుకుంటున్న సమయంలో ఓ కోబ్రా కాటేసింది. దీంతో అతన్ని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. హార్ట్‌బీట్, బీపీ నార్మల్ స్థాయికి వచ్చాయి. మెదడు పనితీరు కూడా స్వల్పంగా పెరిగింది. ఐసీయూలోనే ఇంకా వెంటిలేటర్‌పై అతను చికిత్సను పొందుతున్నాడు. కనీసం 48 గంటల పాటు అతన్ని అబ్జర్వేషన్లో ఉంచనున్నారు.
విషం దిగాలంటే ఆ సమయం కీలకమని డాక్టర్లు చెబుతున్నారు. పాము కాటుకు గురైన సమయంలో వావా సరేశ్ గుండె కేవలం 20 శాతం మాత్రమే పనిచేసింది. స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు ఉన్న సురేశ్‌ను ఏడున్నర అడుగుల త్రాచు పాము అతని కుడి కాలి మోకాలి వద్ద కాటేసింది. సురేశ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇప్పటి వరకు సురేశ్ 300 సార్లు పాము కాటుకు గురయ్యాడు. రెండు సార్లు వెంటిలేటర్‌పై ఉన్నాడు. ఐసీయూలో నాలుగు సార్లు చికిత్స తీసుకున్నాడు. స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళగా కీర్తింగాచిన వావా సురేశ్ పాములు పట్టడంలో నిపుణుడు.