పణాజీ, జూలై 22: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరు వివాదాల్లో చిక్కుకున్నది. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ ఉత్తర గోవాలోని అస్సగావ్‌లో నడుపుతున్న హైక్లాస్ రెస్టారెంట్లో బార్ లైసెన్స్ చనిపోయిన వ్యక్తి పేరుమీద రిన్యూవల్ చేయించుకోవడంపై దుమారం రేగుతున్నది. దీనిపై గోవా ఎక్సైజ్ కమిషనర్ నారాయణ్ ఎం.గడ్ కేంద్రమంత్రి కుమార్తెకు చెందిన సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్‌కు మొన్న 21న షోకాజ్ నోటీసు జారీచేశారు. తప్పుడు పద్ధతుల్లో, నకిలీ పత్రాల ద్వారా ఆమె మద్యం లైసెన్స్ పొందారని న్యాయవాది ఏరిస్ రోడ్రిగ్స్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ నోటీసు ఇచ్చారు. లైసెన్స్‌దారు అంథోనీ దిగామా 2021 మే 17న మరణించినప్పటికీ అతడి పేరు మీదే గతనెల లైసెన్స్ పొడిగింపు పొందారు. అయినప్పటికీ అతడి పేరు మీదే గతనెల 22న దరఖాస్తు చేసుకొని రిన్యూవల్ పొందారు. దరఖాస్తుపై అతడికి బదులుగా మరొకరు సంతకం చేశారు.
ఆరునెలల్లో లైసెన్స్ బదిలీ చేస్తామని కూడా ఆ సందర్భంగా ఎక్సైజ్ శాఖకు హామీ ఇచ్చారు. ఈ నోటీసుపై వచ్చే 29న విచారణ జరుగుతుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా రోడ్రిగ్స్ ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను పొందగలిగారు. కేంద్రమంత్రి కుటుంబ సభ్యులు పాల్పడిన ఈ మెగా మోసంపై లోతుగా దర్యాప్తు జరపాలని, ఇందులో ఎక్సైజ్ అధికారులు, అస్సగావ్ గ్రామపెద్దలు మిలాఖతయ్యారని ఆరోపించారు. నిజానికి గోవాలో బార్ లైసెన్స్ ఇవ్వాలంటే ముందుగా రెస్టారెంట్ ఉండాలి. కానీ రూల్స్ గాలికి వదిలేసి గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటికింకా రెస్టారెంట్ లైసెన్స్ పొందని సిల్లీ సోల్స్‌కు బార్ లైసెన్స్ కట్టబెట్టారని ఆయన దుయ్యబట్టారు.
మొత్తం ఎక్సైజ్ దరఖాస్తులన్నీ ముంబై విల్లెపార్లేకు చెందినట్టుగా చెప్తున్న దిగామా పేరుమీదనే సమర్పించారని, సదరు వ్యక్తి ఆధార్ కార్డు 2020 డిసెంబర్లోనే జారీ అయ్యిందని న్యాయవాది రోడ్రిగ్స్ జరిపిన పరిశోధనలో తేలింది. చిన్నపాటి సమాచారం ఆధారంగా ఆయన నెలల తరబడి ఈ కేసుపై కూపీ లాగారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన దిగామా డెత్ సర్టిఫికెట్ కూడా సంపాదించారు. 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టిన సిల్లీ సోల్స్ వంటి టాప్ రెస్టారెంట్‌కు, ఈ చనిపోయిన వ్యక్తికి ఏం సంబంధమో తెలుసుకోవాలని ఆయన అంటున్నారు. గోవాలో ప్రపంచ స్థాయి రెస్టారెంట్లు లేవని, సిల్లీ సోల్స్ ఆ లోటు తీరుస్తుందని పాకశాస్త్ర నిపుణుడు కునాల్ విజయ్కర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోయిష్ ఇరానీ చెప్పారు. అంత గొప్ప రెస్టారెంట్‌కు అడ్డదారులు తొక్కి బార్ లైసెన్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేదే ఇక్కడ ప్రశ్న.