తిరువనంతపురి, జూలై 13: కేరళలోని కన్నూరు జిల్లాలో కొందరు దినసరి కూలీలు వర్షపు నీటి నిల్వ కోసం ఒక గోతిని తవ్వుతుండగా బంగారం, వెండితో చేసిన ఆభరణాలు బయటపడ్డాయి. పరిప్పాయి ప్రభుత్వ స్కూల్‌కు సమీపంలోని రబ్బర్ ప్లాంటేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ గుప్త నిధిలో 17 ముత్యాల పూసల దండలు, 13 బంగారు లాకెట్లు, నాలుగు పతకాలు, ఐదు పురాతన ఉంగరాలు, ఒక జత చెవి రింగులతో పాటు పలు వెండి నాణెలు లభించాయి.
తొలుత దాన్ని మందు పాతరగా భావించి కంగారుపడ్డ కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వాటిని తవ్వి తీయించిన తర్వాత శుక్రవారం కోర్టుకు అప్పగించారు. వాటి విలువ, అవి ఏ కాలం నాటివో నిర్ధారించాలంటూ పురావస్తు శాఖకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. అవన్నీ పురాతన కాలం నాటివని కొందరు అధికారులు తెలిపారు.
స్పీకర్ కూతురిపై పోస్ట్.. ధ్రువ్ రాఠీపై కేసు
ముంబై : ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్ సభ సభాపతి ఓం బిర్లా కుమార్తె యూపీఎస్సీ పరీక్షలకు హాజరు కాకుండానే ఉత్తీర్ణురాలయ్యారని ఎక్స్‌లోని ఓ పేరడీ ఖాతాలో ఆయన పోస్ట్ చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.