న్యూఢిల్లీ : భారతీయ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ శనివారం చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తన విక్రమ్-1 రాకెట్ మొదటి ఆర్బిటల్ లాంచ్ చేయనున్నది. ఈ మిషన్ ‘ఆగమన్’లో పూర్తిగా ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన లాంచ్ వెహికల్ ఉపయోగించి పేలోడ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. “భూమిపై విక్రమ్-1ను పరీక్షించడానికి చేయగలిగినదంతా మేము చేశాం. జూలై 18న, మొదటిసారిగా నిజమైన ఫ్లైట్ వాతావరణంలో విక్రమ్-1 ఎలా పనిచేస్తుందో చూడటానికి మేం ఆసక్తిగా ఉన్నాం” అని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్‌కుమార్ చందన చెప్పారు.
విక్రమ్-1 అనేది పూర్తిగా నాలుగు దశల ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మొదటి మూడు దశలు సాలిడ్ ప్రొపల్షన్‌ను ఉపయోగిస్తాయి. నాలుగో దశ ఆర్బిటల్ ఇన్సర్షన్, ప్రిసిషన్ విన్యాసాల కోసం లిక్విడ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 350 కిలోల వరకు బరువు ఉన్న చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌కి తీసుకెళ్లడానికి దీనిని నిర్మించారు. దీని మొదటి టెస్ట్ ఫ్లైట్ 60 డిగ్రీల వాలులో 450 కిలోమీటర్ల కక్ష్యను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. విక్రమ్-1 భారతీయ ఎర్త్ అబ్జర్వేషన్ నానోశాటిలైట్ మేకర్ గ్రహ స్పేస్, తదితర సంస్థల నుంచి బహుళ సాంకేతిక ప్రదర్శన పేలోడ్లను తీసుకెళ్లనుంది.