ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా నటించిన లవ్ డ్రామా ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకుడు. పైలా ప్రసాద్‌రావు, కిశోర్ గుండాల కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. వీఎన్ ఆదిత్య, రామ్‌ప్రసాద్, మల్లిడి సత్యనారాయణరెడ్డి, జెమినీ సురేశ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఈ సినిమా ద్వారా యువ నటీనటులు చాలామంది పరిచయం కానున్నారని, ప్లజెంట్‌గా సాగుతూనే చివరిలో ఒక మంచి ట్విస్ట్‌తో సినిమా ఆకట్టుకుంటుందని కథానాయిక సాహితి అవంచ తెలిపారు. హీరోగా అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు హీరో ఖాన్ దురాని కృతజ్ఞతలు తెలిపారు. ‘నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు ఫిక్షన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను. ఇందులోని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాత కిశోర్ గుండాల, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీమురళీ కార్తికేయ కూడా మాట్లాడారు.