న్యూఢిల్లీ: స్కైమెట్ వెదర్(Skymet Weather) సంస్థ హెచ్చరిక చేసింది. రాబోయే నాలుగు వారాల పాటు రుతుపవనాల ప్రభావం ఉండబోదని ప్రైవేట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దీంతో వ్యవసాయం ఈసారి కష్టంగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎక్స్టెండెడ్ రేంజ్ ప్రిడిక్షన్ సిస్టమ్ ప్రకారం జూలై 6వ తేదీ వరకు అంటే మరో నాలుగు వారాల పాటు వర్ష సూచన పెద్దగా లేదని స్కైమెట్ అంచనా వేసింది.
రుతుపవనాల వల్ల రావాల్సిన వర్షాలు ఆలస్యం అవుతున్నాయని, దీంతో వ్యవసాయదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు స్కైమెట్ తెలిపింది. రుతుపవనాల వల్ల దేశంలోని సెంట్రల్తో పాటు పశ్చిమ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు సరిగా ఉండవని స్కైమెట్ అంచనా వేసింది.
నిజానికి జూన్ 8వ తేదీన నైరుతీ రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి. వారం రోజులు ఆలస్యంగా ఆ రుతుపవనాలు వచ్చాయి. అయితే బిపర్జాయ్ తుఫాన్ వల్ల రుతుపవనాలు ఆలస్యం కావడమే కాదు.. ఇప్పుడు రుతుపవనాలు ముందుకు సాగేందుకు కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీంతో దేశంలో మధ్య, పశ్చిమ భాగాలకు వర్షాలు చేరే అవకాశాలు సన్నగిల్లాయి.
జూన్ 15వ తేదీ నాటి వరకు నైరుతు రుతుపవనాలు.. మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, చత్తీస్ఘడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చేరుకోవాలని, కానీ ఈసారి రుతుపవనాల కదలిక మరీ నిదానంగా ఉన్నట్లు స్కైమెట్ చెప్పింది.