Helicopter Crash : ఖతార్ (Qatar) లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశానికి చెందిన ఒక సైనిక హెలికాప్టర్ (Military Helicopter) సముద్ర జలాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది మరణించగా ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం (Technical Issue) తలెత్తడమే ప్రమాదానికి కారణమని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ (Qatar deffence Ministry) ప్రకటించింది.
ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘ఖతార్‌కు చెందిన హెలికాప్టర్ రొటీన్ డ్యూటీలో ఉండగా సాంకేతిక సమస్య కారణంగా దేశ జలాల్లో కూలిపోయింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు సిబ్బంది ఉన్నారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఏడో వ్యక్తి కోసం కోస్ట్‌గార్డ్, బార్డర్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతా దళాలకు చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమేనని, దీని వెనుక ఎలాంటి శత్రుచర్య లేదని అధికారులు స్పష్టంచేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ రకం, అది కూలిపోయిన కచ్చితమైన ప్రదేశం లాంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.