Srirama Navami | రామాయణం అద్భుతమైన దృశ్య కావ్యం. కొందరు ఇది కేవలం పురాణమేనని.. నిజంగా జరిగింది కాదని వాదిస్తుంటారు. అయితే, పుక్కిటి పురాణం కాదని.. యథార్థమేనని హిందువులు నమ్మకం. భారతదేశంలో ఎక్కడ చూసినా పలు చోట్ల శ్రీరాముడికి సంబంధించిన ఆలయాలయాలతో పాటు త్రేతాయుగం నాటికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతాల్లో శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే, ఇందులో ఓ అరుదైన ప్రాంతం సైతం ఉన్నది. అదే జానకీమాత పుట్టిన స్థలం సీతామర్హి. సీతమ్మ వారు భూదేవికి ప్రతిరూపం. ఇంద్రుడి ప్రసన్నం చేసుకునే క్రతువులో భాగంగా జనకమహారాజు.. నాగలితో దున్నుతున్నప్పుడు ఒక పెట్టె అడ్డు తగిలిందని.. అందులోనే సీతమ్మ వారు ఉన్నట్లుగా రామాయణం చెబుతున్నది.
అయితే, సీతమ్మ వారు జనకమహారాజుకు దొరికింది సీతామర్హిలోనేనని స్థానికులు పేర్కొంటారు. ఈ సీతామర్హి బిహార్ రాష్ట్రంలో ఉన్నది. ఇందుకు అనుగుణంగా ఎక్కడ ఎన్నో కట్టడాలు సైతం చూడొచ్చు. జానకీమాత దొరికిన చోట జనకమహారాజు ఓ పెద్ద చెరువును తవ్వించడాని.. వివాహ సందర్భంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఆయనే స్వయంగా స్థాపించారని స్థల పురాణం చెబుతున్నది. ఇందుకే ఈ ప్రదేశాన్ని జానకీ కుండ్గా పిలుస్తుంటారు. ఆ సీతామర్హిలోనే సీతమ్మ జననానికి గుర్తుగా భవ్యమైన జానకీ మందిరం సైతం కనిపిస్తుంది. కాలక్రమేనా ఈ ప్రదేశమంతా అటవీ ప్రాంతంలా మారిందని.. ఈ సమయంలోనే బీర్బల్ దాస్ అనే స్వామీజీకి సీతామర్హి గురించి దివ్వదర్శనం కలిగిందని.. ఆయన పూనికతో నాటి విశేషాలన్నీ మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చాయని స్థానికులు చెబుతుంటారు.
ఇక సీతామర్హికి మరో విశిష్టత సైతం ఉన్నది. రావణ సంహారం తర్వాత లంక నుంచి వచ్చిన సీతామాత స్వచ్ఛతను నిరూపించుకొమ్మని రాముడు ఆదేశిస్తాడు. దాంతో సీతామాత అగ్నిప్రవేశం చేస్తుంది. ఈ ఘట్టం జరిగింది కూడా సీతామర్హిలోనేని చెబుతుంటారు. దీనికి రుజువుగా ఇక్కడ వేడి నీటి బుగ్గలు దర్శనమిస్తాయి. సీతమ్మవారిని దహించలేకపోయిన అగ్ని, అక్కడి భూగర్భంలోని నీటిలోకి చేరి ఇలా ఉబికి వస్తోందని భక్తుల విశ్వాసం. మాఘపౌర్ణమి రోజున ఈ నీటి బుగ్గలో స్నానం చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ సీతామర్హికి వెళ్లాలంటే బిహార్లోని పాట్నా, ముజఫర్పూర్, దర్భంగా పట్టాల నుంచి చేరుకోవచ్చు. ఈ సీతామర్హి గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడిప్పుడే సీతామర్హి గురించి తెలుస్తుండడంతో సందర్శించే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది.