Yatindra Siddaramaiah : కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పు జరుగబోతున్నదని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య (Yatindra Siddaramaiah) ఇవాళ (గురువారం) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారని ధీమా వ్యక్తంచేశారు. తన తండ్రిపై ఎలాంటి ఆరోపణలు లేవని, ఆయన ఎలాంటి కుంభకోణాల్లో భాగం కాలేదని పేర్కొన్నారు.
సిద్ధరామయ్య సుపరిపాలన అందిస్తున్నారని, ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఉందని యతీంద్ర తెలిపారు. అయితే సీఎం మార్పు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికే అందరం కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు రెండున్నరేళ్ల పాలన పూర్తయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో యతీంద్ర వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అధికార పంపిణీ గురించి తనకు తెలియదని, ఎవరూ తనతో చెప్పలేదని ఆయన అన్నారు. ఇచ్చిన మాటకు సిద్ధరామయ్య కట్టుబడి ఉంటారన్నారు.