చండీగఢ్: తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని నిరసన చేస్తున్న రైతులను ఢిల్లీకి కాకుండా పాకిస్థాన్‌కు పంపాలా? అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రశ్నించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బర్వాలా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భగవంత్ మాన్ మాట్లాడారు. ‘రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా హర్యానా, ఢిల్లీ సరిహద్దులోని ఖనౌరీ, శంభు వద్ద ఇనుప మేకులు, బారికేడింగ్లతో అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. కాబట్టి రైతులు అక్కడికి వెళతారు. రైతులు ఢిల్లీకి వెళ్లకపోతే, నేను వారిని పాకిస్థాన్‌లోని లాహోర్‌కు పంపాలా?’ అని అన్నారు. నాలుగేళ్ల కిందట కూడా రైతులను ఢిల్లీలోకి రానీయకుండా అడ్డుకున్నారని, రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన నిరసనలో 726 మంది మరణించారని ఆయన తెలిపారు.
కాగా, హర్యానా ప్రజలు వివిధ పార్టీలకు అవకాశం ఇచ్చారని, అయితే వారంతా రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడైన సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. ‘ఒక వైద్యుడు వ్యాధిని నయం చేయలేకపోతే డాక్టర్‌ను మార్చాలి’ అని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ ఓటర్ల మాదిరిగానే హర్యానా ప్రజలు కూడా ఈసారి మార్పు కోసం ఆప్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రస్తావించారు.