బెంగళూరు, జూన్ 13: హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ తూగుదీప ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రియురాలు పవిత్రాగౌడ్ను సామాజిక మాధ్యమంలో వేధించాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని తన అభిమాన సంఘాల సభ్యులకు సుపారీ ఇచ్చి హత్య చేసినట్టు ఆయనపై ప్రధాన ఆరోపణ. దీంతో ఈ కేసులో దర్శన్, పవిత్రాగౌడ్ సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య చేయడానికి దర్శన్ ముగ్గురికి 15 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ వర్గాలు తెలిపిన వివరాలు ప్రకారం.. హత్య విషయంలో తన పేరు బయటకు రాకూడదని, తామే హత్య చేసినట్టు పోలీసులకు చెప్పాలని, వారికి అయ్యే కోర్టు ఖర్చులు తానే భరిస్తానని దర్శన్ వారికి చెప్పారు.
రేణుకాస్వామిని ఈ నెల 8న వారు ఒక షెడ్లో బంధించిన తర్వాత అతడిని దర్శన్, అనుచరులు కలిసి కర్రలతో కొట్టి చంపారు. ఈ హత్యలో 8 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనంతరం అతడి శవాన్ని బెంగళూరులోని కామాక్షిపాల్య కెనాల్లోకి దర్శన్ సమక్షంలోనే విసిరేశారు. దీనిపై రేణుకాస్వామి భార్య మాట్లాడుతూ పవిత్రాగౌడ్ను తన భర్త సామాజిక మాధ్యమంలో వేధించాడనడం అబద్ధమని అన్నారు. తన భర్తను హత్య చేసిన వ్యక్తి నటుడైనా, స్టారయినా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో తాజాగా దర్శన్ సహ నటుడు ప్రదోశ్, నాగరాజులను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.