సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ ఇరుకును పెట్టేశారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆజంఖాన్ విషయంలో శివపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ములాయం సింగ్, అఖిలేశ్ యాదవ్ తలుచుకుంటే… క్షణాల్లో ఆజంఖాన్ జైలు నుంచి బయటకు వచ్చేస్తారంటూ శివపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంత సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆజంఖాన్ విషయంలో ములాయం ఏమీ చేయలేకపోయారని, లోక్‌సభలోనూ ఆజంఖాన్ అంశాన్ని ప్రస్తావించలేదని, కనీసం ధర్నాలు కూడా చేయలేదని శివపాల్ దెప్పిపొడిచారు. సమాజ్‌వాదీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన శివపాల్ శుక్రవారం జైళ్లో ఉన్న ఆజంఖాన్‌తో భేటీ అయ్యారు. గంట పాటు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగానే శివపాల్ పై వ్యాఖ్యలు చేశారు.
బాబాయ్ శివపాల్ యాదవ్, అబ్బాయ్ అఖిలేశ్ మధ్య కొన్ని రోజులుగా పరోక్ష వార్ నడుస్తోంది. ఇప్పుడు బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపారు. నిజంగా.. నేను అఖిలేశ్‌కు మద్దతివ్వడం లేదని ఆయనకు అనిపిస్తే.. వెంటనే తనను పార్టీ నుంచి తొలగించాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం శివపాల్ యాదవ్ బీజేపీతో టచ్‌లో వున్నారని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శివపాల్ పై విధంగా ఘాటుగా స్పందించారు.