న్యూఢిల్లీ, జనవరి 3: ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రమైన సియాచిన్ గ్లేసియర్‌లోని కుమార్ పోస్ట్‌లో తొలిసారిగా ఒక మహిళా సైనికాధికారిని విధులు నిర్వర్తించనున్నారు. సముద్రమట్టానికి 15,600 అడుగుల ఎత్తైన ఈ ప్రాంతంలో కెప్టెన్ శివ చౌహాన్ ఈ అత్యంత క్లిష్టమైన బాధ్యతలను సోమవారం తీసుకున్నారు. కెప్టెన్ శివ చౌహాన్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
ఇంతకుముందు సియాచిన్ గ్లేసియర్‌లోని 9000 అడుగుల ఎత్తులోని సియాచిన్ బేస్ క్యాంపులో పలువురు మహిళా సైనికులు పని చేశారు. సియాచిన్‌లో విధులు కేటాయించే ముందు సియాచిన్ బాటిల్ స్కూల్లో కఠినమైన శిక్షణ ఉంటుంది. మంచుగోడలు అధిరోహించడం, తీవ్రమైన హిమపాతాన్ని తట్టుకోవడం, అత్యంత చలిలో మనుగడ సాగించడం వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. మూడు నెలల పాటు శివ చౌహాన్ ఈ శిక్షణ పూర్తి చేశారు. కాగా, రాజస్థాన్‌కు చెందిన కెప్టెన్ శివ చౌహాన్ 11 ఏండ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు.