HCL | న్యూఢిల్లీ, మార్చి 8: దేశంలో మూడో అతిపెద్ద టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ్ నాడార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా దినోత్సవం రోజే పలు సంస్థల్లో తనకున్న వాటాను తన గారాలపట్టి రోష్ని నాడార్ మల్హోత్రాకు బదిలీ చేశారు. హెచ్‌సీఎల్ కంపెనీతోపాటు అనుబంధ సంస్థలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్(ఢిల్లీ) ప్రైవేట్ లిమిటెడ్‌లోని తనకున్న మొత్తం వాటాలో 47 శాతం వాటాను రోష్నికి బదిలీ చేస్తూ గిఫ్డ్ డీడ్లను అమలుచేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 6న బదిలీ చేశారు. ఈ బదిలీ అనంతరం ఈ రెండు సంస్థలకు రోష్ని నాడార్ నాయకత్వం వహించనున్నారు. వామా ఢిల్లీ, హెచ్‌సీఎల్ కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీలో మెజార్టీ వాటాదారుడిగా రోష్ని కొనసాగనున్నారు. ఈ బదిలీకి ముందు శివ్ నాడార్.. రోష్ని నాడార్ మల్హోత్రాకు రెండు సంస్థల్లోనూ వరుసగా 51 శాతం, 10.33 శాతం వాటా కలిగివున్నారు. ఈ కేటాయింపుల అనంతరం హెచ్‌సీఎల్ కార్పొరేషన్, వీఎస్ఐపీఎల్లో రోష్ని వాటాలు 57.33 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో శివ్‌నాడార్ వాటా 4 శాతానికి పరిమితమయ్యాయి. గతంలో హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్లో హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌కు 49.94 శాతం వాటా ఉండగా, వామా ఢిల్లీకి 12.94 శాతం వాటా ఉన్నది.
సెబీ అనుమతి..
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఈ వాటా బదిలీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఓపెన్ ఆఫర్ ద్వారా షేర్ల బదిలీ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. వామా ఢిల్లీ, హెచ్‌సీఎల్ కార్పొరేషన్లలో శివ్ నాడార్, రోష్ని నాడార్కు ఉన్న 51 శాతం, 10.33 శాతం వాటా బదిలీ మరింత సులభంగా కానున్నది. వామా ఢిల్లీలో రోష్ని వాటా 44.17 శాతానికి చేరుకోనుండగా, అలాగే హెచ్‌సీఎల్ కార్పొరేషన్లో 0.17 శాతం వాటా ఉండనున్నది. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్లో డిగ్రీ పట్టా పొందిన రోష్ని.. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పొందారు. జూలై 2020 నుంచి 12 బిలియన్ డాలర్ల విలువైన హెచ్‌సీఎల్ టెక్నాలజీ కంపెనీ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, సామాజిక బాధ్యతలో భాగంగా శివ్ నాడార్ ఫౌండేషన్ పేరుతో ప్రారంభించిన సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.