తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే సుధాకరన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అని, మా పార్టీలో ఎవరికైనా అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. థరూర్ అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటే ఆయనను నిందించాల్సిన అవసరం లేదని చెప్పారు.
థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడతానంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందని, ఆయనకు అధ్యక్షుడికి ఉండాల్సిన అర్హతలు లేవా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పార్టీలో కావాలనుకుంటే నేను కూడా అధ్యక్ష పదవికి పోటీపడవచ్చని, పార్టీ కూడా అంగీకరిస్తుందని, కావాల్సినన్ని ఓట్లు సాధించగలిగితే నేనే అధ్యక్షుడిని కావచ్చని అన్నారు.
శశిథరూర్ మలయాళ పత్రిక మాతృభూమికి రాసిన ఓ ఆర్టికల్‌లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సుధాకరన్ తాజాగా పై వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరుగనున్నాయి. అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.