భారత ప్రధాని మోదీతో టీవీ మాధ్యమంగా చర్చలు జరపాలనుకుంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. యుద్ధం కంటే.. చర్చలే ఉత్తమమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే.. భారత టీవీ ఛానళ్ల చర్చల్లో ఏ సమస్యా పరిష్కారం కాదని, ఇంకా తీవ్రమౌతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘యుద్ధం కంటే సుదీర్ఘ చర్చలే సరైనవి. ఉత్తమమైనవి. భారత్లోని టీవీ ఛానళ్లలో జరిగే చర్చల ద్వారా ఒక్క సమస్యా పరిష్కారం కాదు.. పైగా జటిలమవుతుంది. పైగా… తమ టీవీ టీఆర్పీల కోసం కొందరు యాంకర్లు మూడో ప్రపంచ యుద్ధానికీ తెర లేపేందుకు ప్రయత్నాలు చేస్తారు’ అంటూ శశి థరూర్ తన అక్కసును వెళ్లగక్కారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ మాధ్యమంగా చర్చించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఈ టీవీ చర్చ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ… ‘భారత ప్రధాని మోదీతో టీవీ మాధ్యమంగా చర్చించాలని అనుకుంటున్నా. ఇలా చేస్తే ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయని భావిస్తున్నా. ఇలా చేస్తే ప్రజలకు మేలు కలుగుతుంది’ అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.