ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని అధికారులు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) బ్యాగులను, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం పూణె జిల్లాలోని బారామతి హెలిప్యాడ్ వద్ద ఈ సంఘటన జరిగింది. షోలాపూర్‌లో ఎన్నికల ర్యాలీకి హాజరయ్యేందుకు హెలికాప్టర్లో శరద్ పవార్ ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆ హెలికాప్టర్‌తోపాటు ఆయన బ్యాగులను ఎన్నికల అధికారులు చెక్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, తొలుత ప్రతిపక్ష నేతల బ్యాగులను ఎన్నికల అధికారులు చెక్ చేయడంపై ఎంవీఏ కూటమి నేతలు విమర్శించారు. తన బ్యాగులను తనిఖీ చేయడంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎం షిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్ బ్యాగులను చెక్ చేయరా? అని ప్రశ్నించారు.
మరోవైపు సీఎం షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా బ్యాగులను కూడా ఈసీ అధికారులు ఆ తర్వాత తనిఖీ చేశారు. శనివారం రాహుల్ గాంధీ బ్యాగులు, అంతకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బ్యాగులను కూడా అధికారులు చెక్ చేశారు. నవంబర్ 20న మహారాష్ట్రలో పోలింగ్ జరుగనున్నది. 23న జార్ఖండ్‌తో సహా కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
Maharashtra: NCP (SP) leader Sharad Pawar’s helicopter and bag were checked today in Baramati pic.twitter.com/TBMLX1LFLM
— IANS (@ians_india) November 17, 2024