ముంబై: తన చిన్నాన్నకు 82 ఏళ్ల వయసొచ్చిన ఇంకా రాజకీయాల్లోంచి రిటైర్ అవడంలేదంటూ శరద్‌పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సీనియర్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే విషయంలో తాను ‘టైర్ అవను, రిటైర్ అవను’ (అలసిపోను, విరమించను) అంటూ గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.
‘మొరార్జీ దేశాయ్ ఎన్నేళ్లకు ప్రధానమంత్రి అయ్యాడో తెలుసా..?’ అని ప్రశ్నించారు. కానీ, తాను ప్రధానమంత్రిని కావాలనో, మంత్రిని కావాలనో ఆశపడటం లేదని, చేతనైనన్ని రోజులు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని చీల్చి ఏక్నాథ్ షిండే సర్కారులో చేరిన తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడి వయసు గురించి అజిత్‌పవార్ కామెంట్ చేశాడు.
ప్రభుత్వ ఉద్యోగులు 60 ఏళ్లకు రిటైర్ అవుతారని, రాజకీయ నాయకులకు కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుందని అజిత్‌పవార్ వ్యాఖ్యానించాడు. బీజేపీలో 75 ఏళ్లు వచ్చిన తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని యువతకు అవకాశం ఇస్తారని అన్నారు. కానీ, తన బాబాయ్ శరద్‌పవార్ మాత్రం 82 ఏళ్లు వచ్చినా రిటైర్మెంట్ తీసుకోవడంలేదని, ఇప్పటికైనా ఆయన రిటైర్ అవ్వాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు శరద్‌పవార్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.