Brij Bhushan | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): భారత మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా రెజ్లర్లతో బ్రిజ్‌భూషణ్ నీచమైన చర్యలకు తెగబడేవాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను బట్టి తెలుస్తున్నది.
రెజ్లర్-1: ‘ఒక రోజు రెస్టారెంట్లో నేను డిన్నర్‌కు వెళ్లినప్పుడు.. తన టేబుల్ వద్దకు రమ్మని బ్రిజ్‌భూషణ్ పిలిచాడు. తన చేయిని నా రొమ్ముమీద ఉంచాడు. అలా నిమురుతూ కిందకు వచ్చి పొట్ట మీద చేయి ఉంచాడు. తర్వాత, మళ్లీ పైకి వచ్చి రొమ్మును నిమిరాడు. ఇలా 3-4 సార్లు అదేపనిగా చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ ఆఫీసులో నా మోకాళ్లు, తొడలు, భుజాలను తడిమాడు. ఆ సమయంలో నేను భయంతో వణికిపోయా. శ్వాస క్రియను పరీక్షిస్తున్నానన్న సాకుతో నా రొమ్మును, పొట్టను అదే పనిగా నిమిరాడు.
రెజ్లర్-2: సాధనలో భాగంగా ఓ రోజు నేను చాపపై కూర్చున్నా. ఇంతలో బ్రిజ్‌భూషణ్ వచ్చి నా టీ-షర్ట్ లాగాడు. శ్వాస క్రియను పరీక్షిస్తున్నానన్న సాకుతో నా రొమ్మును, పొట్టను అదే పనిగా నిమిరాడు. ఓసారి ఫెడరేషన్ కార్యాలయానికి వెళ్లా. నాతోపాటు వచ్చిన మా సోదరుడిని బయటే ఉండమని, నన్ను మాత్రమే లోపలికి పిలిచాడు. అప్పటికే అక్కడ ఉన్నవారిని బయటకు పంపించి నన్ను గట్టిగా తనవైపు లాక్కొన్నాడు.
రెజ్లర్ 3: అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. ‘ఇంట్లో వాళ్లతో మాట్లాడుతావా?’ అంటూ నాకు ఫోన్ ఇచ్చి తన బెడ్ మీదకు నన్ను బలవంతంగా లాక్కొని కౌగిలించుకొన్నాడు. తన కోరిక తీరిస్తే, అథ్లెట్‌గా తనకు కావాల్సినవన్నింటినీ సమకూరుస్తానన్నాడు.
రెజ్లర్ 4: నా టీ-షర్ట్ లాగాడు. నా పొట్టను, బొడ్డును అదే పనిగా నిమిరాడు. ఒంటరిగా రమ్మని బలవంతపెట్టేవాడు. దీంతో మేము గుంపులుగానే బయటకు వెళ్లేవాళ్లం.
రెజ్లర్ 5: ఫొటోలు తీసుకొనేప్పుడు నేను ఆఖరు వరుసలో ఉంటే, అతను నా పక్కుకు వచ్చి నిల్చొనేవాడు. నా పిరుదులను తడిమేవాడు. ఆ చర్యలు నాకు ఇబ్బందికరంగా ఉండేవి. భయపడి నేను అక్కడి నుంచి వెళ్దామనుకొంటే, నా భుజాన్ని గట్టిగా పట్టుకొనేవాడు.
రెజ్లర్ 6: ఫొటో సాకుతో నన్ను అభ్యంతరకరంగా తాకేవాడు. నేను అడ్డుచెప్తే.. ‘చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావ్.. భవిష్యత్తులో టోర్నమెంట్లు ఆడాలని లేదా?’ అంటూ బెదిరించేవాడు. ఓసారి నాకు తెలియని ఓ పదార్థాన్ని తీసుకొచ్చి తినమని చెప్పాడు. దాని వల్ల ఫిట్‌గా ఉంటావని చెప్పాడు. నేను వద్దన్నా. పోటీల్లో నేను ఓ సారి గాయపడ్డా. అప్పుడు తనతో సాన్నిహిత్యంగా ఉంటే చికిత్స ఖర్చులన్నీ ఫెడరేషనే భరిస్తుందన్నాడు. రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ వినోద్ తోమర్ కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.
ఆమెను (రెజ్లర్లలో ఒక మహిళను) బ్రిజ్‌భూషణ్ గట్టిగా హత్తుకొనేవాడు. తనవైపు గట్టిగా లాక్కొనేవాడు. ఆమె భుజాలను గట్టిగా నొక్కేవాడు. రొమ్మును ఉద్దేశపూర్వకంగా నిమిరేవాడు. ‘ఇలాంటి చర్యలు తనకు ఇష్టంలేదని’ అమె పదేపదే అంటున్నా బ్రిజ్‌భూషణ్ ఆగేవారు కాదు.
పతకాలు గంగలో పడేస్తామన్న రెజ్లర్లకు 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టు సభ్యులు ఓ విన్నపం చేశారు. ‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదని, వాటిలో ఈ దేశ ప్రతిష్ఠ కూడా ఇమిడి ఉందన్నారు. ఈ నిర్ణయం విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దని హితవు పలికారు. మరోవైపు, సోమవారం అయోధ్యలో నిర్వహించాలనుకొన్న ‘జన చేతన్ మహా ర్యాలీ’ వాయిదా వేస్తున్నట్టు బ్రిజ్‌భూషణ్ ప్రకటించారు.
బ్రిజ్‌భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) డిమాండ్ చేసింది. లేదంటే, రెజ్లర్లతో సహా జంతర్ మంతర్ వద్ద తాము కూడా దీక్షకు కూర్చొని దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపుల గురించి 2021లోనే రెజ్లర్లు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు ఎఫ్ఐఆర్ కాపీలను బట్టి తెలుస్తున్నది. మోదీని కలిసినప్పుడు ఈ విషయాలను ఆయనకు వివరించామని, క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఫిర్యాదులపై తగిన విధంగా స్పందిస్తుందని ఆయన తమతో చెప్పి భరోసా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో ఓ రెజ్లర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, సమస్య పరిష్కారమవ్వలేదని ఆమె వాపోయారు.