జైపూర్: రాజస్తాన్‌లోని జున్జును జిల్లాలో ఉన్న కొలిహన్ గని(Kolihan Mine)లో జరిగిన ప్రమాదంలో సీనియర్ విజిలెన్స్ ఆఫీసర్ మృతిచెందాడు. మంగళవారం రాత్రి 15 మంది సిబ్బంది గనిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దాంట్లో ఇవాళ ఉదయం 14 మందిని రక్షించారు. ఆ గనిని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ సంస్థ ఆపరేట్ చేస్తున్నది. ముగ్గురు వర్కర్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జైపూర్‌లోని మణిపాల్ ఆస్పత్రి డాక్టర్ పునీత్ తెలిపారు. గాయపడ్డ కార్మికుల్లో ఎక్కువ శాతం మంది పాదాలకు, మడిమలకు గాయాలైనట్లు డాక్టర్ వెల్లడించారు. తొలి రౌండ్లో గని నుంచి ముగ్గుర్ని కాపాడారు. రెండో రౌండ్లో అయిదుగురు ఉద్యోగులను రక్షించారు. ఆ తర్వాత రౌండ్లో మిగితా వారిని కాపాడినట్లు తెలుస్తోంది.
కోల్‌కతా నుంచి వచ్చిన విజిలెన్స్ టీమ్‌తో పాటు మైన్ అధికారులు లిఫ్ట్‌లో ఇన్స్పెక్షన్ కోసం దిగుతున్న సమయంలో అది కూలింది. గనిలో సుమారు 577 మీటర్ల లోతులో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. తొలుత మెడికల్ హెల్ప్ కోసం గనిలోని ఎగ్జిట్ గేటు ద్వారా 8 మంది సభ్యులు డాక్టర్లు, నర్సుల బృందాన్ని పంపించారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉపేంద్ర పాండే, ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ యూనిట్ హెడ్ జీడీ గుప్తా, కొలిహన్ మైన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏకే శర్మ, ఓ జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్ కూడా విజిలెన్స్ టీమ్‌లో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ఆదేశించారు. ఖేత్రిలో కాపర్మైన్ను 1967లో స్థాపించారు.