థానే: ముంబైలోని థానే కాలేజీలో ఓ సీనియర్ ఎన్సీసీ క్యాడెట్(NCC Cadet) వికృతంగా ప్రవర్తించాడు. జూనియర్లను వర్షపు నీటిలో పుష్ అప్ పొజిషన్లో ఉంచి.. తన చేతుల్లో ఉన్న కర్రతో వాళ్లను చితకబాదాడు. ఈ ఘటనకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. థానేలో ఉన్న బందోద్కర్ కాలేజీలో ఈ దారుణ ఘటన జరిగింది. దాదాపు 8 మంది ఎన్సీసీ క్యాడెట్లను శిక్షణ సమయంలో పుష్ అప్ పొజిషన్లో ఉంచి.. వాళ్లకు ఛాలెంజింగ్ డ్రిల్ ఇచ్చాడు ఆ సీనియర్ క్యాడెట్. అయితే ఆ ఛాలెంజ్‌ను సరిగా చేయలేకపోయిన జూనియర్లను అతను చాలా కిరాతకంగా కొట్టాడు. ఎన్సీసీ క్యాడెట్ల వెన్ను భాగంలో కర్రతో బాదాడు. ఓ కాలేజీ స్టూడెంట్ తన మొబైల్ ఫోన్‌తో ఈ వీడియో తీశాడు. దెబ్బలు తట్టుకోలేక కొందరు విద్యార్థులు ఏడ్చేశారు.
ఈ ఘటన పట్ల కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రవర్తన సహించబోమన్నారు. సీనియర్ ఎన్సీసీ క్యాడెట్‌పై చర్యలు తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు. గత 40 ఏళ్ల నుంచి కాలేజీలో ఎన్సీసీ ప్రోగ్రామ్‌లు జరుగుతన్నాయని, తమ కాలేజీకి మంచి పేరుందని ఆమె అన్నారు.