EPFO | న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పీఎఫ్ సొమ్మును మరింత సులభంగా, వేగంగా విత్‌డ్రా చేసుకునే కొత్త విధానం అందుబాటులోకి రానున్నది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి ఆమోదం వచ్చే వరకు ఎదురుచూడాల్సిన పని లేదు. ఖాతాదారులే సొంతంగా పీఎఫ్ విత్‌డ్రాను ఆమోదించుకోవచ్చు. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చిలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కొత్త సెల్ఫ్ అప్రూవల్ విధానాన్ని తీసుకురానున్నట్టు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఈపీఎఫ్ఓ అధికారులు మాన్యువల్‌గా పరిశీలించిన తర్వాత ఆమోదిస్తారు. ఆమోదం లభించిన రెండుమూడు రోజులకు బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 7-10 రోజులు పడుతున్నది.
ఈపీఎఫ్ఓ తీసుకురానున్న కొత్త విధానం వచ్చిన అనంతరం పీఎఫ్ సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఖాతాదారులే సొంతంగా ఆమోదించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ అధికారులు మాన్యువల్‌గా పరిశీలించే పద్ధతి ఉండదు. దీంతో పీఎఫ్ డబ్బులు వేగంగా పొందవచ్చు. అయితే, ఏ అవసరానికి ఎంత మేరకు పీఎఫ్ బ్యాలెన్స్‌ను తీసుకోవచ్చు అనే దానికి సంబంధించిన పరిమితులు మాత్రం కొనసాగనున్నాయి.
క్లెయిమ్ చేసుకున్న డబ్బులు ఉండేలా డిజిటల్ వాలెట్‌ను తీసుకురావాలని ఈపీఎఫ్ఓ భావిస్తున్నది. ఇందుకోసం ఆర్బీఐతో చర్చిస్తున్నది. తాత్కాలిక ద్రవ్య సర్దుబాటు కోసం వాణిజ్య బ్యాంకుల క్యాష్-క్రెడిట్ సదుపాయాలను ఈపీఎఫ్ఓ వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖాతాదారులు ఉద్యోగాలు మారినప్పుడు మెంబర్ ఐడీలు బదిలీ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించనున్నది.