బెంగళూరు: బెంగళూరు కేంద్ర కారాగారంలో భద్రతాపరమైన లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా బయటపడిన రెండు వీడియోలు ఖైదీల విలాసాలను వెలుగులోకి తెచ్చాయి. మొదటి వీడియోలో, ఇక్కడి ఖైదీలు ఆనందోత్సాహాలతో గడుపుతున్నట్లు, మద్యం, వేరుశనగలు, పండ్ల ముక్కలతో పార్టీ చేసుకుంటున్నట్లు కనిపించింది. రెండో వీడియోలో, నాలుగు చిన్న మద్యం సీసాలు కనిపించాయి. కొందరు ఖైదీలు పాత్రలను వాయిస్తూ ఉంటే, అందుకు అనుగుణంగా మరికొందరు నృత్యం చేస్తున్నట్లు కనిపించింది.
అంతకుముందు వెలుగులోకి వచ్చిన వీడియోలలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం ఉగ్రవాదులను నియమించుకుంటున్న నేరగాడు, వరుస అత్యాచారాలు, హత్యలు చేసిన దోషి ఆనందంగా గడుపుతున్నట్లు కనిపించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయమై స్పందిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర హెచ్చరించారు.