Justice Yashwant Verma | న్యూఢిల్లీ, మార్చి 23 : ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలను ఆర్పుతున్న సందర్భంగా పెద్దయెత్తున నోట్ల కట్టలు బయటపడటం సంచలనం సృష్టిస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ రోజు అగ్నిప్రమాదంలో జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు కాలుతున్న దృశ్యాలను అక్కడ ఉన్న పోలీసులు ఫోన్లలో వీడియో తీశారు. అయితే ఆ వీడియోలను వెంటనే మొబైల్స్ నుంచి తొలగించాలంటూ పోలీస్ ఉన్నతాధికారుల నుంచి సిబ్బందికి ఆదేశాలు వచ్చాయి. ఎంతో ముఖ్యమైన సాక్ష్యంగా పనికివచ్చే వీడియో సాక్ష్యాన్ని డిలీట్ చేయాలంటూ ఆదేశాలు రావడం ఏమిటని పోలీస్ శాఖలో చర్చలు ప్రారంభమయ్యాయి. ‘ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు మీ ఫోన్లో ఉంచుకోవద్దు. వెంటనే డిలీట్ చేయండి. వాటి కాపీలు కూడా తీయవద్దు, ఉంచవద్దు. ఎవరికీ షేర్ చేయవద్దు.’ అంటూ తమకు ఆదేశాలు వచ్చినట్టు పోలీస్ శాఖలోని ఒక దిగువ ర్యాంక్ ఉద్యోగి తెలిపారు. కాగా, వర్మ ఇంటికి సమీపంలోని చెత్త కుప్పలో కాలిన 500 రూపాయల నోట్లు లభ్యం కావడం సంచలనంగా మారింది.
తన ఇంట్లో పెద్దయెత్తున కాలిన నోట్లు లభ్యమయ్యాయని వస్తున్న ఆరోపణలను జస్టిస్ వర్మ కొట్టివేశారు. ఈ మేరకు కేసు విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్కు లేఖ రాస్తూ తన ఇంట్లో అగ్నిప్రమాదం తర్వాత తన ఇంటి ప్రాంగణం నుంచి కానీ, స్టోర్ రూమ్లో నుంచి కాని ఎలాంటి కాలిన నోట్లను అధికారులు స్వాధీనం చేసుకోలేదని చెప్పారు.
జస్టిస్ వర్మపై ఆరోపణలపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సీజేఐకు నివేదిక పంపారు. జస్టిస్ వర్మ ఇంట్లో నాలుగైదు గోతాంలలో పాక్షికంగా కాలిన నోట్లు లభ్యమైనట్టు తన నివేదికలో పేర్కొన్నారు. లభించిన ప్రాథమిక ఆధారాల మేరకు దీనిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాగా, జస్టిస్ దేవేంద్రకుమార్ నివేదికను సుప్రీం కోర్టు శనివారం సాయంత్రం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. దీనిపై విచారణకు ముగ్గురు జడ్జీలతో ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది.